కరోనా టెస్టులో నెగెటివ్.. ఆ టెస్టుకు ఆసుపత్రి వేసిన బిల్లేమో రూ.40 లక్షలు!

  • అమెరికాలోని టెక్సాస్ లో ఘటన
  • బిల్లు చూసి కంగుతిన్న వ్యాపారి
  • ఇన్సూరెన్స్ తో రూ.12.56 లక్షలకు ఒప్పందం
  • వ్యాపారి భార్యకు రూ.లక్షన్నర
కరోనా టెస్టుకు మన దగ్గర ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో అయితే రూ.వెయ్యి అవుతుంది. ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధర రూ.450 అయినా.. పీపీఈ కిట్లని, జీఎస్టీ అని దానికి అదనంగా వసూలు చేస్తూనే ఉన్నారు. మన దగ్గర సరే.. మరి అమెరికాలో ఒక్క టెస్టుకు ఎంతుంటుందంటారు? అక్కడ ఒక్క ధరంటూ లేదు. మామూలుగా అయితే 20 డాలర్ల (రూ.1,500) నుంచి 1,419 డాలర్ల (రూ.1.05 లక్షలు) దాకా వసూలు చేస్తుంటారు. అయితే, ఒక్కో ఆసుపత్రిలోను డిమాండ్ ను బట్టి ఆ ధరలు మారుతుంటాయి.

అయితే, ఇలాగే గత ఏడాది జూన్ లో టెక్సాస్ కు చెందిన ట్రావిస్ వార్నర్ అనే ఓ వ్యాపారవేత్త టెస్ట్ చేయించుకుంటే.. దిమ్మ తిరిగే బిల్లు వేసింది మోలినా హెల్త్ కేర్ అనే ఆసుపత్రి. టెస్టులో నెగెటివ్ వచ్చి అతడు ఊపిరి పీల్చుకున్నా.. టెస్ట్ బిల్లు చూసి ఆ ఊపిరి ఆగినంతపనైంది. ఆర్టీపీసీఆర్ టెస్టుకు 54 వేల డాలర్లు (సుమారు రూ.40 లక్షలు), యాంటీజెన్, ఆసుపత్రి ఫీజు కలిపి మరో 2,384 డాలర్లు (సుమారు రూ.1.77 లక్షలు) బిల్లు వేసి పంపించింది ఆసుపత్రి.

అయితే, ఇన్సూరెన్స్ ఉండడంతో 16,915.20 డాలర్లకు (రూ.12.56 లక్షలు)  ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకో విచిత్రమేంటంటే వార్నర్ టెస్ట్ చేయించుకున్న రోజే, అదే సమయంలో, అదే ఆసుపత్రిలో అతడి భార్య కూడా టెస్ట్ చేయించుకుంది. కానీ, ఆమెకు మాత్రం కేవలం 2 వేల డాలర్ల (రూ.1.48 లక్షలు) ఫీజునే వసూలు చేశారు. బేరమాడితే వెయ్యి డాలర్లకు (రూ.74 వేలు) తగ్గించారు.


ఇంతటి తేడాకు కారణం టెస్టులకు ఉండే డిమాండేనని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. టెస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలూ పెరుగుతాయని చెబుతోంది. గత ఏడాది జరిగిన ఈ ఘటన గురించి తాజాగా అక్కడి వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా, మామూలుగా అయితే, ఒక్కో టెస్టుకు (పీసీఆర్) 5 డాలర్లుంటుందని, సర్వీస్ చార్జీలు ఇతరత్రా కలుపుకొంటే 8 నుంచి 15 డాలర్లేనని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News