పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్.. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్!

  • బీజేపీలో చేరను, కాంగ్రెస్ లో ఉండనని నిన్ననే ప్రకటించిన అమరీందర్ సింగ్
  • 15 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న సన్నిహితులు
  • పలువురు ఎమ్మెల్యేలు అమరీందర్ పార్టీలో చేరే అవకాశం
బీజేపీలో చేరను, కాంగ్రెస్ పార్టీలో ఉండబోనంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీని అమరీందర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే ఆయన పలువురు ఎమ్మెల్యేలు, రైతు నేతలతో చర్చలు జరిపారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అమరీందర్ తో టచ్ లో ఉన్నారని... ఆయన పార్టీని నెలకొల్పిన వెంటనే వారంతా ఆ పార్టీలో చేరుతారని చెపుతున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అమరీందర్ భావిస్తున్నారు.

మరోపక్క, ఇప్పటికే పంజాబ్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఆప్ కూడా సమరనాదం చేస్తోంది. ఈ క్రమంలో అమరీందర్ పార్టీని నెలకొల్పితే పంజాబ్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు చెపుతున్నారు.


More Telugu News