మేం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమిత్ షా, ఆరెస్సెస్ కార్యకర్తలు సాయం చేశారు: దిగ్విజయ్ సింగ్

  • సహచరుడు ఓపీ శర్మ రాసిన ‘నర్మదా పథిక్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన దిగ్విజయ్
  • నాలుగేళ్ల క్రితం ‘నర్మదా పరిక్రమ్’ యాత్ర సందర్భంగా ఎదురైన అనుభవాల వెల్లడి
  • అమిత్ షాను నేరుగా కలవకున్నా పలు వేదికల ద్వారా కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నానన్న డిగ్గీరాజా
అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా డిగ్గీరాజా మాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అమిత్ షా, ఆరెస్సెస్ కార్యకర్తలు గొప్ప సాయం చేశారని చెప్పుకొచ్చారు. తన దీర్ఘకాల సహచరుడు ఓపీ శర్మ రాసిన ‘నర్మదా పథిక్’ పుస్తకాన్ని దిగ్విజయ్ ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం తాను నర్మదా నది వెంట 3 వేల కిలోమీటర్ల మేర ‘నర్మదా పరిక్రమ్’ పాదయాత్ర చేపట్టానని పేర్కొంటూ ఆ సందర్భంగా ఎదరైన అనుభవాలను పంచుకున్నారు. యాత్రలో భాగంగా ఓ రాత్రి తాము దట్టమైన అడవిలో ఇరుక్కుపోయామని, ముందుకు వెళ్లే దారి కనిపించక, అలాగని అక్కడ ఉండే వీలులేక ఇబ్బంది పడుతున్న సమయంలో అకస్మాత్తుగా తమ ముందు ఓ అటవీ అధికారి ప్రత్యక్షమయ్యారని చెప్పారు.

ఆరా తీస్తే తనను అమిత్ షా పంపించారని, అన్ని విధాలుగా సహకరించాలని ఆదేశించారని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు. ఆయన తమకు ఆ రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా పర్వతాల వెంబడి దారి చూపించారని పేర్కొన్నారు.

అలాగే,  యాత్రలో భాగంగా భరూచ్‌లో తమకు మాంఝీ సమాజ్ ధర్మశాలలో ఆరెస్సెస్ కార్యకర్తలు బస ఏర్పాటు చేశారని, తమ కోసం ఎందుకింత కష్టపడుతున్నారని వారిని ప్రశ్నిస్తే పైనుంచి ఆదేశాలు అందాయని చెప్పారని డిగ్గీ రాజా పేర్కొన్నారు. రాజకీయ సమన్వయం, సర్దుకుపోవడం, స్నేహానికి రాజకీయాలు, భావజాలం అడ్డం కాబోవనడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాతి నుంచి ఇప్పటి వరకు తాను అమిత్‌షాను కలవలేదని, అయితే, పలు వేదికల ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నానని దిగ్విజయ్ తెలిపారు.


More Telugu News