వాట్సాప్‌ పేమెంట్స్: ఇకపై ఈ సింబల్ క్లిక్ చేస్తే చాలు!

  • యూపీఐ పేమెంట్స్ సులభతరం చేసిన వాట్సాప్
  • రూపీ సింబల్ క్లిక్ చేసి పేమెంట్ చేసే సదుపాయం
  • కెమెరాతో క్యూఆర్ కోడ్‌ కూడా స్కాన్ చేయొచ్చు
  • వెల్లడించిన వాట్సాప్ ఇండియా డైరెక్టర్ మనీశ్ మహాత్మే
ప్రపంచంలో ఎక్కువ మంది వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనిలో పేమెంట్స్ చేసే సదుపాయాన్ని గతేడాదే భారత్‌లో కల్పించారు. కానీ ఇది అంత పాప్యులర్ కాలేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి, పేమెంట్ ప్రక్రియ. ఎవరికైనా డబ్బు పంపాలంటే సదరు వ్యక్తి చాట్‌లోకి వెళ్లి, పిన్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్‌లోకి వెళ్లేవాళ్లం.

కానీ ఇకనుంచి జస్ట్ రూపీ సింబల్ క్లిక్ చేస్తే చాలు. ఇలా పేమెంట్స్‌ను సులభతరం చేసినట్లు వాట్సాప్ ఇండియా డైరెక్టర్ మనీశ్ మహాత్మే వెల్లడించారు. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. వాట్సాప్‌లో మెసేజిలు పంపుకున్నట్లే ఇకపై పేమెంట్స్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకే రూపీ సింబల్ యాడ్ చేసినట్లు తెలిపారు.

పేమెంట్స్ సేవలు ప్రారంభించడానికి వాట్సాప్‌కు గతేడాదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలుత ఈ అవకాశాన్ని 20 మిలియన్ల మందికి అందిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ సంఖ్యను నెమ్మదిగా పెంచుతామని వెల్లడించింది.

కొన్ని మార్కెటింగ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు గురువారం నాడు మనీశ్ మహాత్మే వెల్లడించారు. దీంతో వాట్సాప్‌లో కూడా గూగుల్ పేలో ఉన్నట్లు స్క్రాచ్ కార్డులు తీసుకొస్తారని వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. మరి చూడాలి వాట్సాప్ ఎలాంటి ఆఫర్స్ తీసుకొస్తుందో.


More Telugu News