కేబినెట్ సమావేశం తర్వాత సిద్ధూ డిమాండ్లపై సీఎం చన్నీ కీలక ప్రకటన?

  • సిద్ధూ డిమాండ్లకు అంగీకరించిన సీఎం చన్నీ
  • అక్టోబరు 4న పంజాబ్ కేబినెట్ సమావేశం
  • అవినీతి అధికారులను తొలగించాలని సిద్ధూ డిమాండ్!
పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపిన తన రాజీనామాపై నవజోత్ సింగ్ సిద్ధూ పునరాలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ చన్నీతో సమావేశం తర్వాత సిద్ధూ మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధూ చేసిన చాలా డిమాండ్లపై చన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

దీంతో పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాపై పునరాలోచిస్తానని సిద్ధూ చెప్పినట్లు తెలుస్తోంది. అక్టోబరు 4న పంజాబ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత సిద్ధూ డిమాండ్ల గురించి చన్నీ కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పదవుల్లో నుంచి తొలగించాలని సిద్ధూ పట్టుబడుతున్నారట.

ఈ నేపథ్యంలో పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతోపాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను కూడా పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. 2015లో అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇక్బాల్ నేతృత్వం వహించారు. ఆ సమయంలో గురు గ్రంధ్ సాహిబ్‌ను అవమానించారని నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు ఇక్బాల్‌ ప్రధాన కారకుడని సిద్ధూ ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు చన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది.


More Telugu News