అనంతపురం జిల్లాలో సీఐకి పుష్పాభిషేకం చేసిన హిజ్రాలు... వీడియో ఇదిగో!

  • హిజ్రా అనుష్క ఇంట్లో దొంగతనం
  • రూ.4 లక్షల నగదు, 6.5 తులాల బంగారం చోరీ
  • లబోదిబోమన్న హిజ్రా
  • పోలీసులకు ఫిర్యాదు
  • కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఐ
అనంతపురం జిల్లా ఉరవకొండ సీఐ శేఖర్ ను హిజ్రాలు ఘనంగా సన్మానించారు. ఆయనపై పూల వాన కురిపించారు. ఓ దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించడంతో హిజ్రాలు సీఐకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాలలోకి వెళితే, విడపనకల్ గ్రామానికి చెందిన అనుష్క అలియాస్ హనుమప్ప ఓ హిజ్రా. గత నెలలో అనుష్క ఇంట్లో చోరీ జరిగింది. రూ.4 లక్షల నగదు, 6.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

దీనిపై హిజ్రా అనుష్క ఇతర హిజ్రాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అని పోలీసుల ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది. చేతిలో నయాపైసా లేకుండా ఎలా బతకాలంటూ భోరున విలపించింది. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఉరవకొండ సీఐ శేఖర్ ఎంతో చొరవ చూపారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగలను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు.

దాంతో అనుష్క, ఇతర హిజ్రాల సంతోషం అంతాఇంతా కాదు. పోయిందనుకున్న సొత్తు తిరిగి దక్కడంతో సీఐ శేఖర్ వారికి దేవుడిలా కనిపించారు. ఈ క్రమంలో ఉరవకొండ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. బుట్టల కొద్దీ పూలు తీసుకువచ్చి ఆయనకు పుష్పాభిషేకం చేశారు. డోలక్ వాయిస్తూ ఆడిపాడారు.


More Telugu News