'కేటీఆర్ కనిపించుటలేదు'... హైదరాబాద్ నగర శివార్లలో నిరసన పోస్టర్లు

  • ఇటీవల భారీ వర్షాలు, వరద పరిస్థితులు
  • ప్రభుత్వం స్పందించడంలేదన్న రంగారెడ్డి జిల్లా వాసులు
  • మిస్సింగ్ అంటూ కేటీఆర్ పై పోస్టర్లు
  • నిరసన తెలియజేసిన ప్రజలు
ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరద పరిస్థితులు సంభవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనిపించడం లేదంటూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జల్ పల్లి, బడంగ్ పేట్, బాలాపూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.

 మిస్సింగ్... ఇతన్ని మీరు చూశారా? అంటూ కేటీఆర్ ఫొటోతో ఆ పోస్టర్లు రూపొందించారు. తమ ప్రాంతాల్లో వరద సంబంధిత సమస్యలపై ఎన్ని మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించడంలేదన్న తీవ్ర ఆగ్రహంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఈ పోస్టర్ల ద్వారా తమ నిరసన తెలియజేశారు.

వర్షాకాలం వస్తే చాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సర్వీసులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. ఓ సామాజిక కార్యకర్త దీనిపై స్పందిస్తూ, కేటీఆర్ ఎప్పుడూ సింగపూర్, డల్లాస్ గురించే మాట్లాడుతుంటారని, కానీ ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి వచ్చి పరిశీలించాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.


More Telugu News