పవన్ వెళతానన్న ప్రాంతాల్లో ఇప్పుడు హడావిడిగా రోడ్లు వేస్తున్నారు: నాదెండ్ల

  • ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పోరాటం
  • అక్టోబరు 2న రెండు చోట్ల శ్రమదానానికి పవన్ నిర్ణయం
  • కాటన్ బ్యారేజిపై అధికారుల అనుమతి నిరాకరణ
  • మీరు చేయరు, మమ్మల్ని చేయనివ్వరంటూ నాదెండ్ల అసహనం
ఏపీలో పలు ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందంటూ జనసేన పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజిపై పవన్ కల్యాణ్ శ్రమదానం చేసేందుకు సిద్ధపడగా, అధికారులు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. కాటన్ బ్యారేజిపై శ్రమదానం చేసితీరుతామని స్పష్టం చేశారు. మీరు చేయరు, మేం శ్రమదానం చేస్తామంటే చేయనివ్వరు అంటూ అసహనం ప్రదర్శించారు.

ఎవరు అడ్డుకున్నా వెనుకంజ వేసేది లేదని, శ్రమదానం విషయంలో ముందుకెళ్లి తీరుతామని అన్నారు. పవన్ వెళ్లే ప్రాంతాల్లో ఇప్పుడు హడావిడిగా రోడ్లు వేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించాలని తాము కోరితే, వ్యక్తిగత దూషణలెందుకని ప్రశ్నించారు. ఇక, బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీతో చర్చించిన పిదప నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


More Telugu News