మీతో తోలు తీయించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు: పవన్ పై ఏపీ హోంమంత్రి ఆగ్రహం

  • పవన్ పై ఏపీ మంత్రుల ఫైర్
  • పవన్ కు నిలకడలేదన్న సుచరిత
  • రెండు చోట్ల ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు
  • పవన్ వి దిక్కుమాలిన మాటలన్న శంకరనారాయణ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. ఇటీవల సీఎం జగన్ పైనా, ఏపీ ప్రభుత్వంపైనా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత పవన్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడని, ఇక్కడెవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. నిలకడలేని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియదని విమర్శించారు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల నిలబడితే, రెండు చోట్లా ప్రజలు ఓడించారని, మరి వచ్చే ఎన్నికల్లో ఇంకెన్ని చోట్ల నిలబడతారో, అసలాయనను ప్రజలు అంగీకరిస్తారో లేదో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఓసారి తాను లెఫ్టిస్టునంటాడు... ఆ తర్వాత బీజేపీతో భాగస్వామినంటాడు... మరోసారి టీడీపీతో వెళతానంటాడు... పవన్ కల్యాణ్ ఎలాంటి వాడన్నది ప్రజలకు సంపూర్ణంగా స్పష్టమైందని వివరించారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు పంచుకున్న అనంతరం జనసేన, టీడీపీ మైత్రి బట్టబయలైందని సుచరిత వ్యాఖ్యానించారు.

అటు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఇవాళ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ ను విమర్శించారు. పవన్ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కు తెలిసిందల్లా ప్రభుత్వంపై బురదచల్లడం ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాల సీజన్ ముగిశాక రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని వెల్లడించారు.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కు రెండు నియోజకవర్గాల్లో ప్రజలు తాటతీసినా ఆయన బలుపు తగ్గలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే ఏంటో సీఎం జగన్ ను చూసి నేర్చుకోవాలని పవన్ కు హితవు పలికారు.


More Telugu News