జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి టీడీపీ శ్రేణుల లేఖలు

  • చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో ఫిర్యాదు 
  • రాష్ట్రంలోని రాక్షస పాలనకు పరాకాష్ఠ  అన్న టీడీపీ  
  • డీజీపీని రీకాల్ చేయాలని కోరిన టీడీపీ వర్గాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దమనకాండ జరుగుతోందని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్ దండయాత్రగా రావడం ఈ ఆటవిక పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు లేఖల రూపంలో ఫిర్యాదులు పంపారు.

గ్రామ కమిటీల్లోని నేతలు తీర్మానాలు చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం కోసం జోగి రమేశ్, అతని అనుచరులు దండయాత్రగా రావడం రాష్ట్రంలోని రాక్షస పాలనకు పరాకాష్ఠ అని పేర్కొంది.

ఈ దాడికి డీజీపీ, సీఎంల మద్దతు ఉందని జోగి రమేశ్ బహిరంగంగా ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించిన టీడీపీ.. డీజీపీని రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం నేతృత్వంలో ఇలాంటి దాడి జరగడం ప్రజాస్వామ్యానికే చీకటి రోజని అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, ఇళ్లపై దాడులు చేయడం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని టీడీపీ నాయకులు అన్నారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు.


More Telugu News