కాషాయ కండువా కప్పుకోనున్న కెప్టెన్ అమరీందర్?

  • ఇటీవల సీఎం పదవి నుంచి తప్పుకున్న పంజాబ్ నేత
  • రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో వివాదం
  • కాంగ్రెస్‌పై అక్కసుతో బీజేపీలో చేరతారని ప్రచారం
కొన్నిరోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ సీఎం త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ ఒక వార్త పంజాబ్‌లో వినిపిస్తోంది. నేడు దేశరాజధాని ఢిల్లీలో కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను ఆయన కలిసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు అమరీందర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు కాషాయ పార్టీ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అసలే తనను సీఎం పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్‌పై అక్కసుతో ఉన్న అమరీందర్ ఇదే అదనుగా భావించి కాషాయ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పంజాబ్ కాంగ్రెస్‌లో అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే అమరీందర్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించింది. ఇదే సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవిని అమరీందర్‌కు బీజేపీ ఆఫర్ చేసిందట.

దీంతో ఆయన కూడా బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నేరుగా బీజేపీలో చేరడం కెప్టెన్‌కు ఇష్టం లేకపోతే, సొంత పార్టీ పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలనూ కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


More Telugu News