కెరీర్ లోనే తొలి హ్యాట్రిక్.. టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన హర్షల్ పటేల్

  • అది తన చేతుల్లో లేదన్న ఆర్సీబీ పేసర్
  • తన లక్ష్యం క్రికెట్ ఆడడమేనని వ్యాఖ్య 
  • మంచి ప్రదర్శన చేయడమే గోల్ అని కామెంట్
  • తన స్కూల్ లైఫ్ లోనూ హ్యాట్రిక్ తీయలేదన్న హర్షల్
హర్షల్ పటేల్.. గత ఐపీఎల్ వరకు అతడో అనామక ఆటగాడు. కానీ, ఈ సీజన్ అతడి ఫేటే మార్చేసింది. ఐపీఎల్ 2021లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కేవలం 10 మ్యాచ్ లలోనే 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నాడు. గత ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టిలో పడ్డాడీ యువ పేసర్.

ఆ మ్యాచ్ లో 3.1 ఓవర్లు వేసిన హర్షల్ ఒక మెయిడెన్ వేశాడు. 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్ లో 58 మ్యాచ్ లాడిన హర్షల్.. 69 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటు డొమెస్టిక్ క్రికెట్ లోనూ మంచి గణాంకాలనే హర్షల్ నమోదు చేశాడు. 64 ఫస్ట్ క్లాసు మ్యాచ్ లలో 226 వికెట్లను పడగొట్టాడు. అయితే, అతడిని టీ20 వరల్డ్ కప్ నకు మాత్రం సెలెక్ట్ చేయలేదు.

దానిపై హర్షల్ స్పందించాడు. ఎంపిక కాకపోవడం తననేమీ బాధించలేదని, తన లక్ష్యం క్రికెట్ ఆడడమేనని స్పష్టం చేశాడు. సెలెక్షన్ అనేది తన చేతుల్లో లేదని చెప్పాడు. తాను ఏ టీమ్ కు ఆడినా.. మంచి ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. తాను క్రికెట్ ఆడినంత కాలం అదే తన గోల్ అని తెలిపాడు.

హ్యాట్రిక్ పైనా స్పందించాడు. తన జీవితంలో అదే తొలి హ్యాట్రిక్ అన్నాడు. కనీసం తన స్కూల్ లైఫ్ లోనూ హ్యాట్రిక్ తీసిన సందర్భాలు లేవని చెప్పాడు. ఈ తొలి హ్యాట్రిక్ ను జీర్ణించుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపాడు.


More Telugu News