పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ కు గుండెపోటు

  • గత మూడు రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడిన ఇంజమామ్
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన లాహోర్ ఆసుపత్రి వైద్యులు
  • వన్డేల్లో 11,701 పరుగులు చేసిన ఇంజమామ్
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రపంచ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. నిన్న తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన లాహోర్ లోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం నిన్న సాయంత్రం ఆయనకు యాంజియోప్లాస్టీని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
 
ఇంజమామ్ ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు. పాకిస్థాన్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత ఇంజమామ్ పేరిటే ఉంది. 375 వన్డేలు ఆడిన ఇంజమామ్ మొత్తం 11,701 పరుగులు చేశారు. 119 టెస్టులు ఆడిన ఆయన 8,829 రన్స్ చేశారు. అత్యంత విజయవంతమైన పాకిస్థాన్ కెప్టెన్లలో ఒకరిగా కూడా ఆయన గుర్తింపు పొందారు.

 2007లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ కు పలు స్థానాల్లో ఆయన సేవలు అందించారు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పని చేశారు. 2016-19 మధ్య కాలంలో పాక్ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్ గా కూడా సేవలందించారు. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.


More Telugu News