ఒక్కరినే తప్పుపట్టడం సరికాదు.. ముంబై ఓటమిపై మాజీ క్రికెటర్ సాబా కరీం

  • బెంగళూరుపై ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్
  • ఛేజింగ్‌లో 54 పరుగుల తేడాతో ఓడిన జట్టు
  • ఇషాన్ కిషన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు
బెంగళూరు, ముంబై జట్ల మధ్య రసవత్తరంగా సాగుతుందనుకున్న ఐపీఎల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌పై పలువురు విమర్శలు కురిపించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అంత నిర్లక్ష్యంగా ఆడతారా? అంటూ కిషన్‌ను తప్పుబట్టారు.

ఈ క్రమంలో భారతజట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సాబా కరీం స్పందించారు. జట్టు ఓటమికి ఒక్క బ్యాట్స్‌మెన్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆర్సీబీతో మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమిపాలైంది.

ఈ ఓటమికి ఒక్క బ్యాట్స్‌మెన్‌ను బాధ్యుడిని చేయడం సరికాదు. బ్యాట్స్‌మెన్లంతా విఫలమయ్యారు కాబట్టే జట్టు ఓడిపోయింది’’ అని కరీం చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన ముంబై జట్టును తేలిగ్గా తీసుకోకూడదని కూడా కరీం అన్నాడు.

ఐపీఎల్‌లోని ప్రమాదకరమైన జట్లలో ముంబై ఒకటని, దాన్ని తక్కువగా అంచనా వేసిన జట్టు భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశాడు. కాగా, ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో అత్యథిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టు ముంబై ఇండియన్స్ అనే విషయం తెలిసిందే.


More Telugu News