హైదరాబాదులో మళ్లీ కుంభవృష్టి... ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న జీహెచ్ఎంసీ

  • నగరంపై విరుచుకుపడిన వరుణుడు
  • గంట నుంచి అతి భారీవర్షం
  • మరో రెండు గంటలు కురుస్తుందన్న జీహెచ్ఎంసీ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాదు నగరాన్ని వరుణుడు వీడడంలేదు. ఇప్పటికే ఉపరితల ఆవర్తనాలతో అతి భారీ వర్షాలను చవిచూసిన భాగ్యనగరం... గులాబ్ తుపాను తీరం చేరిన ప్రభావంతో మరోసారి వరుణుడి తీవ్రతకు గురైంది. ఈ సాయంత్రం హైదరాబాదును కుంభవృష్టి పలకరించింది. కారుమబ్బులు కమ్ముకువచ్చిన కాసేపటికే వర్షం విరుచుకుపడింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఫిలింనగర్, యూసుఫ్ గూడ, మణికొండ, దిల్ సుఖ్ నగర్, కోఠి, చార్మినార్, సైదాబాద్, రామాంతపూర్, అంబర్ పేట, మలక్ పేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో గంట నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది.

ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురుస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్ల నుంచి వెలుపలికి రావొద్దని హెచ్చరించారు.


More Telugu News