సజ్జనార్ కు సమన్లు పంపిన 'దిశ' కమిషన్

  • ఎన్ కౌంటర్లో దిశ హత్యాచారం నిందితుల మృతి 
  • విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ
  • విచారణకు హాజరుకానున్న సజ్జనార్
హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యాచారం జరిపి, దారుణంగా హతమార్చిన దుండగులు ఎన్ కౌంటర్ లో మరణించారు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ఉన్నారు.

మరోవైపు, ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిటీ విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా సజ్జనార్ ను కూడా త్రిసభ్య కమిటీ విచారించనుంది. దీనికి గాను సజ్జనార్ కు ఇప్పటికే సమన్లు కూడా జారీ అయ్యాయి. విచారణ రేపు లేదా ఎల్లుండి జరిగే అవకాశం ఉంది.

ఇంకోవైపు, దిశ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సమర్పించిన నివేదికపై నేడు త్రిసభ్య కమిటీ విచారణ జరపనుంది. ఈ విచారణకు మానవ హక్కుల సంఘంలోని ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు కమిటీ ముందు హాజరు కానున్నారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ వేసింది. ఈ సిట్ కు మహేశ్ భగవత్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

ఈయన ఇప్పటికే పలుమార్లు త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే, కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కొంత సమయం కావాలని ఆయన అడిగినట్టు సమాచారం. మరి కొన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ముందు ఆయన ఈరోజు మరోసారి విచారణకు హాజరుకానున్నారు.


More Telugu News