వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కొడుకు తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ తో పట్టుబడ్డాడు: టీడీపీ నేత పట్టాభి

  • డ్రగ్స్ పుట్ట పగిలిందన్న పట్టాభి
  • వైసీపీ విషసర్పాలు బయటికి వస్తున్నాయని వెల్లడి
  • ఉదయభాను తనయుడికి డ్రగ్స్ టెస్టు చేయాలంటూ వ్యాఖ్యలు 
  • తాను కూడా నమూనాలు ఇస్తానని స్పష్టీకరణ
ఇటీవల గుజరాత్ లో వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడగా, దాని లింకులు విజయవాడలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అప్పట్నించి టీడీపీ నేతలు అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, టీడీపీ అధికార ప్రతనిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రెస్ మీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ పుట్టలోంచి వైసీపీ విషసర్పాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని అన్నారు. 'హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ' అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కొడుకు ప్రశాంత్ తెలంగాణ సరిహద్దులో 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడని పట్టాభి ఆరోపించారు. అయితే, తాడేపల్లి ప్యాలెస్, ప్రగతిభవన్ మధ్య మంతనాలు జరిగాయని, అనంతరం ప్రశాంత్ ను ఈ వ్యవహారం నుంచి తప్పించారని వెల్లడించారు.

డ్రగ్స్ దందాపై ప్రశ్నిస్తున్న టీడీపీపై ఎమ్మెల్యే ఉదయభాను నోరు పారేసుకుంటున్నారని పట్టాభి విమర్శించారు. ప్రశాంత్ కు డ్రగ్స్ తో సంబంధం లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రశాంత్ తో పాటు నమూనాలు ఇవ్వడానికి తాను కూడా సిద్ధమేనని పట్టాభి స్పష్టం చేశారు. తన సవాల్ ను స్వీకరించే దమ్ము ఎమ్మెల్యే ఉదయభానుకు ఉందా? అని ప్రశ్నించారు.


More Telugu News