తెలంగాణపైనా ‘గులాబ్’ తుపాను ప్రభావం.. నేడు, రేపు అతి భారీ వర్షాలకు అవకాశం!

  • నేటి సాయంత్రం గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • గంటకు 75 నుంచి 95  కిలోమీటర్ల వేగంతో గాలులు
  • కళింగపట్నానికి ఈశాన్యంగా 440 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుపాను తెలంగాణపైనా ప్రభావం చూపుతుందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న కూడా హైదరాబాద్ సహా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక ‘గులాబ్’ తుపాను కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. నేటి సాయంత్రం గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, చత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.


More Telugu News