చిరంజీవి గారూ... ప్రాధేయపడడం మానుకోండి!: పవన్ కల్యాణ్

  • రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్
  • ఏపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు
  • సినీ టికెట్ల వ్యవహారంపై విమర్శనాస్త్రాలు
రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం సినీ టికెట్ల అమ్మకాన్ని ఎందుకు చేపడుతోందో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, దాంతో తాము ఇన్ని వ్యాపారాలు చేస్తున్నామని బ్యాంకులకు చూపించి, రుణాలు తీసుకునేందుకే ఏపీ సర్కారు సినిమా టికెట్లు అమ్మేందుకు సిద్ధపడిందని అన్నారు. చిత్రపరిశ్రమ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

"చిత్ర పరిశ్రమ నుంచి మాకు ఆదాయం వస్తోంది, మటన్ దుకాణాల ద్వారా మాకు ఆదాయం వస్తోంది... ఎలాగూ ఇసుక అమ్మేసుకుంటున్నాం.. అంటూ దానిపై వచ్చే ఆదాయాన్ని కూడా బ్యాంకులకు చూపిస్తారు" అని వివరించారు. ఎక్కడైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ కు వెళితే సరి... మీకో క్వార్టర్ బాటిల్ ఇస్తారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

"ఇలాంటి వాటిపై వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. చిత్ర పరిశ్రమను కూడా ఆ విధంగానే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. మీరు 100 మంది నుంచి ట్యాక్సులు వసూలు చేసి 40 మందికి ధారపోస్తామంటే, మిగతా 60 మంది చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మేల్కొనాలి. దీనిపై నిలదీసే హక్కు మీకుంది. చిరంజీవి గారి లాంటి వ్యక్తులకు కూడా చెప్పండి... ప్రాధేయపడవద్దని చెప్పండి. ఇది మీ హక్కు. ఈ హక్కుతో మాట్లాడండి. ఈ దేశం ఒకడి సొత్తు కాదు. బావా బావా అనో, సోదరా సోదరా అనుకుంటే సరిపోదు, గట్టిగా ప్రశ్నించాలి" అని ఉద్ఘాటించారు.


More Telugu News