హైదరాబాదులో కుండపోత వాన... లోతట్టు ప్రాంతాలు జలమయం!

  • దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం
  •  ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్
  • ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్న జీహెచ్ఎంసీ
  • సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 040-29555500  
హైదరాబాదు నగరవ్యాప్తంగా భారీ వర్షం ముంచెత్తింది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, ఎల్బీ నగర్, కోఠి, హియాయత్ నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్ పుర, చార్మినార్, మాదన్నపేట తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఫిలింనగర్ లో బస్తీ నీటమునిగింది.

నగరంలో చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. మాదాపూర్-కూకట్ పల్లి ఫ్లైఓవర్ పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పంజాగుట్ట, సోమాజీగూడ, టోలీచౌకి-మెహదీపట్నం, కోఠి-సికింద్రాబాద్ మార్గంలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. వారాంతం కావడంతో భారీగా బయటికి వచ్చిన జనాలు భారీవర్షం కారణంగా రోడ్లపైనే చిక్కుకుపోయారు.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని స్పష్టం చేశారు. భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాచారం, సహాయం కోసం 040-29555500 నెంబరుకు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు. అటు, విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.


More Telugu News