ఇటలీ నాకు ఆహ్వానం పంపినా.. కేంద్రం అడ్డుకుని వెళ్లనివ్వడం లేదు: మమతా బెనర్జీ

  • ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు
  • ప్రత్యేక అనుమతులు కూడా మంజూరు చేసిన ఇటలీ 
  • మోదీకి తనపై అసూయ అని విమర్శలు
  • తాను కూడా హిందూ మహిళనేనని కౌంటర్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తనను చూసి ఈర్ష్య పడుతున్నారని విమర్శించారు. ఇటలీలో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లనివ్వడంలేదని ఆరోపించారు. ఈ సదస్సుకు జర్మనీ చాన్సలర్ తో పాటు పోప్ కూడా వస్తున్నారని మమత వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ తనకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసిందని, కానీ కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు.

ఈ సదస్సుకు ఓ ముఖ్యమంత్రి వెళ్లడం సరికాదని కేంద్రం అంటోందని ఆరోపించారు. తనపై అసూయతోనే ప్రధాని మోదీ ఈ విధంగా చేస్తున్నారని వెల్లడించారు. మోదీ ఎక్కువగా హిందువుల గురించి మాట్లాడుతుంటారని, తాను కూడా హిందూ మహిళనే అని, మరి తననెందుకు అనుమతించరని మమత ప్రశ్నించారు.

మోదీ... మీరు నన్ను ఇటలీ వెళ్లకుండా ఆపలేరు అని స్పష్టం చేశారు. తనకేమీ విదేశాలకు వెళ్లాలన్న మోజు లేదని ఈ సందర్భంగా మోదీకి చురకలంటించారు. అయితే ఇటలీ ఆహ్వానం దేశ గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.


More Telugu News