హయత్‌నగర్ బాతుల చెరువు వద్ద మహిళ మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించిన కేసులో వీడిన చిక్కుముడి!

  • అనారోగ్యంతో మృతి చెందిన భార్య
  • అంత్యక్రియలకు డబ్బుల్లేక చెరువు కట్టవద్ద ఖననం చేసే యత్నం
  • అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో బాతుల చెరువు సమీపంలో ఇద్ద‌రు యువ‌కులు ఓ యువ‌తి మృత‌దేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటనలో చిక్కుముడి వీడింది.

ఆ యువతి బాధితుడి భార్యేనని, అనారోగ్యంతో చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేక చెరువుకట్టపై ఖననం చేసేందుకు ప్రయత్నించినట్టు తేలింది. ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం ఈనకల్లుకు చెందిన డేగ శ్రీను, కర్ణాటకకు చెందిన లక్ష్మి (30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.

ఆరునెలల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు హయత్‌నగర్‌లో ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. లక్ష్మి ఇటీవల అనారోగ్యం పాలవడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం రోజులానే పనికి వెళ్లిన శ్రీను సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య లక్ష్మి తీవ్ర అస్వస్థతతో అల్లాడిపోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె మరణించింది.

అయితే, అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో స్థానికంగా ఉండే బాతుల చెరువు వద్ద ఖననం చేయాలని నిర్ణయించిన శ్రీను.. ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి చెరువు వద్దకు మోసుకెళ్లాడు. స్థానికులు గుర్తించి శ్రీనును అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించగా అనారోగ్యంతోనే లక్ష్మి మరణంచినట్టు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News