విపక్ష నేతలు వలస పక్షుల్లా తయారయ్యారు: సజ్జల

  • సజ్జల ప్రెస్ మీట్
  • చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై విమర్శలు
  • హైదరాబాద్ నుంచి వచ్చిపోతుంటారని వ్యాఖ్యలు
  • స్టీల్ ప్లాంట్ పై పవన్ పోరాడితే మంచిదేనన్న సజ్జల
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిషత్ ఫలితాలతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అయితే భారీ విజయాల్లో చిన్న చిన్న నాయకత్వ సమస్యలు సహజమేనని అంగీకరించారు. జగన్ నాయకత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ సందర్భంగా సజ్జల విపక్ష నేతలపై విమర్శలు సంధించారు. విపక్షంలో అందరూ వలస పక్షులేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాదు నుంచి ఇక్కడికొచ్చి ఒకపూట ఉండి మళ్లీ వెళ్లిపోతాడని, కొడుకు నారా లోకేశ్ దీ అదే తీరు అని విమర్శించారు.

"మరొకాయన పవన్ కల్యాణ్ కూడా అంతే... ఆయన అక్కడే ఎందుకు ఉంటున్నారో, ఇలాగైతే నేను రావాల్సి ఉంటుంది అని ఎందుకు బెదిరిస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రజల్ని బెదిరిస్తున్నారో, మరెవరిని బెదిరిస్తున్నారో అర్థం కావడంలేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన పోరాటం చేసి విజయం సాధిస్తే ఎవరికీ అభ్యంతరంలేదు. బీజేపీతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని స్టీల్ ప్లాంట్ అంశంలో సానుకూల ఫలితం తీసుకువస్తే ఈ క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవచ్చు" అని సజ్జల స్పష్టం చేశారు.


More Telugu News