చీర ధరించి వచ్చిన మహిళను అడ్డుకున్న రెస్టారెంట్‌‌కు షాక్.. విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్

  • కుమార్తె పుట్టిన రోజు కోసం రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకున్న మహిళ
  • చీరకట్టుకుని రావడంతో లోపలికి అనుమతించని సిబ్బంది
  • దారుణమైన విషయంగా పేర్కొన్న మహిళా కమిషన్
  • తమ ఎదుట హాజరు కావాలంటూ రెస్టారెంట్ అధికారులకు నోటీసులు
కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని భావించిన ఢిల్లీకి చెందిన అనితా చౌదరి అనే మాజీ జర్నలిస్టు.. తమ ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని, రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు.

దీంతో అవాక్కైన ఆమె హోటల్ సిబ్బందితో వాదించినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగింది. ఈ విషయం మొత్తాన్ని ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళను లోపలికి అనుమతించని రెస్టారెంటుపై దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు, ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలని రెస్టారెంట్ మార్కెటింగ్, ప్రజా సంబంధాల డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. భారతీయ సంస్కృతిలో భాగమైన చీరను ధరించి వచ్చిన మహిళను లోపలికి అనుమతించకపోవడాన్ని దారుణమైన విషయంగా పేర్కొన్న మహిళా కమిషన్.. భారతీయ మహిళల్లో అత్యధికమంది చీరను ధరిస్తారని, వస్త్రధారణ ఆధారంగా ప్రవేశాన్ని నిలిపివేయడం గౌరవప్రదంగా జీవించే ఆమె హక్కును కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది.


More Telugu News