తనకు చెప్పకుండా భార్యకు వ్యాక్సిన్ ఇచ్చిందని.. నర్సు ముఖం పగలగొట్టిన భర్త

  • షెర్‌బ్రూక్‌ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు
  • నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఒక నిరసనకారుడు తన భార్యకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే దగ్గరలోని ఫార్మసీకి వెళ్లాడు. అక్కడి నర్సులపై కేకలేశాడు. అనంతరం అక్కడ ఉన్న నర్సు ముఖం పగిలేలా పిడిగుద్దులు కురిపించాడు.

ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు సదరు నిందితుడి భార్య అక్కడే వ్యాక్సిన్ తీసుకుందా? లేదా? అనేది కూడా తెలియదని పోలీసులు చెప్పారు. ఈ ఘటన కెనడాలోని షెర్‌బ్రూక్ అనే ప్రాంతంలో జరిగింది. ‘‘నిందితుడు నేరుగా ఆఫీసులోకి వెళ్లి, అక్కడ ఉన్న నర్సుపై కేకలు వేయడం ప్రారంభించాడు’’ అని పోలీసులు తెలిపారు.

నిందితుడి భార్య నిజంగానే వ్యాక్సిన్ తీసుకుందా? అలాగే ఆ సమయంలో ఆమె ఏమైనా ప్రతిఘటించిందా? కూడా తెలియదని పోలీసులు వివరించారు. ఈ ఘటన గురించి తెలియడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కెనడాలో స్కూళ్లు, ఆసుపత్రుల సమీపంలో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇకపై నిరసనలు జరగకుండా చట్టాలు తెస్తామని క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ హామీ ఇచ్చారు.


More Telugu News