ఐపీఎల్ 2021: లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం

  • విజయంతో రెండో దశను ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్
  • ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
  • ఢిల్లీ బౌలర్ల దెబ్బకు తలవంచిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్
ఐపీఎల్ తొలి దశలో అదరగొట్టి అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ కేపిటల్స్ రెండో దశనూ విజయంతో ఆరంభించింది. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.

మరోవైపు, ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో ఓడిన హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. రబడ, నార్జ్, అక్షర్ పటేల్ దెబ్బకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగా, ఢిల్లీ మరో 13 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఓపెనర్ పృథ్వీషా 11 పరుగులకే అవుట్ కాగా, ధావన్ 42, శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 47 పరుగులు చేశారు. రిషభ్ పంత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయడంతో ఢిల్లీ 17.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ తొలి ఓవర్‌లోనే వార్నర్ వికెట్‌ను చేజార్చుకుని కష్టాలతో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.

హైదరాబాద్ జట్టులో అబ్దుల్ సమద్ చేసిన 28 పరుగులే అత్యధికం అంటే ఆ జట్టు ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రషీద్ ఖాన్ 22 పరుగులు చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ 18, సాహా 18, మనీష్ పాండే 17, హోల్డర్ 10 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబడ 3 వికెట్లు పడగొట్టగా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అన్రిక్ నార్జ్ 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. నేడు  ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబిలో మ్యాచ్ జరగనుంది.


More Telugu News