2,000 మంది మహిళల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాలి.. బెయిలివ్వడానికి సరికొత్త షరతు విధించిన కోర్టు

  • తోటి గ్రామస్థురాలిని బలాత్కరించడానికి ప్రయత్నించిన లలన్ కుమార్
  • ఏప్రిల్ 19న అరెస్టు.. అప్పటి నుంచి జైల్లోనే
  • సత్ప్రవర్తన కారణంగా బెయిలు మంజూరు చేసిన కోర్టు
  • 2 వేల మంది మహిళల దుస్తులు శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసివ్వాలని షరతు
అత్యాచార యత్నం కేసులో అరెస్టయిన ఒక యువకుడికి కోర్టు సరికొత్త షరతు విధించింది. గ్రామంలోని 2,000 మంది మహిళల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని బిహార్‌లోని మధుబని కోర్టు సదరు యువకుడిని ఆదేశించింది. లలన్ కుమార్ అనే యువకుడు ఏప్రిల్ 17న తన గ్రామానికి చెందిన ఒక యువతిని బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఆ మరుసటి రోజు అతనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో ఏప్రిల్ 19న లలన్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న అతను తాజాగా బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి అవినాష్ కుమార్.. బెయిలివ్వడానికి అంగీకరించారు. జైల్లో లలన్ సత్ప్రవర్తన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి చెప్పారు.

అయితే ఇక్కడే ఈ షరతు విధించారు. గ్రామంలో మొత్తం 2 వేల మహిళల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి తిరిగి వారికి అందించాలని లలన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రతిని గ్రామపెద్ద నసీమా ఖటూన్‌కు కూడా అందించారు. ఆమె ప్రతిరోజూ లలన్ పనిని గమనించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ పనికి అవసరమయ్యే డిటర్జెంట్ పౌడర్, సబ్బు, ఇస్త్రీకి అవసరమైన వస్తువులను కూడా లలన్ స్వయంగా కొనుక్కోవాలని కోర్టు తెలిపింది.

కోర్టు నిర్ణయం చాలా బాగుందని, దీనివల్ల మహిళా వ్యతిరేకులకు స్త్రీని గౌరవించడం అలవాటవుతుందని నసీమా అభిప్రాయపడ్డారు. గ్రామంలో మొత్తం 425 మంది మహిళలు ఉన్నారని, వీరంతా రొటేషన్ పద్ధతిలో లలన్‌కు ఉతకడానికి దుస్తులు అందిస్తారని ఆమె చెప్పారు. మొత్తమ్మీద 2 వేలు పూర్తయ్యే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఆరు నెలల్లోగా తన శిక్ష పూర్తి చేసుకొని నసీమాతోపాటు స్థానిక పోలీసు స్టేషన్ నుంచి కూడా లలన్ ధ్రువపత్రాలు తీసుకోవాలి. వీటిని తీసుకెళ్లి కోర్టులో దఖలు పరచాల్సి ఉంటుంది.


More Telugu News