ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను సీఎం కానివ్వను.. తేల్చిచెప్పిన అమరీందర్ సింగ్

  • కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌పై యుద్ధం ప్రకటించిన మాజీ సీఎం
  • సిద్ధూ ప్రమాదకర వ్యక్తి.. అతనితో దేశానికి, పంజాబ్‌కు ప్రమాదం
  • ఆయనపై బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఓడిస్తా: అమరీందర్
ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కానివ్వనని ప్రకటించారు. సిద్ధూ ప్రమాదకరమైన వ్యక్తని, అతని వల్ల పంజాబ్‌తోపాటు దేశానికి కూడా ప్రమాదమేనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టి, సిద్ధూను ఓడిస్తానని శపథం చేశారు.

పంజాబ్ సీఎం సీటులో సిద్ధూ కూర్చోకుండా చేసేందుకు ఎలాంటి త్యాగం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరు నేతల మధ్య చాలా కాలంగా విభేదాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం సూచనల మేరకు తన ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.

రాజీనామా సమయంలో మాట్లాడుతూ తాను ఇప్పటికే మూడు సార్లు అవమానానికి గురయ్యానని, ఇకపై ఇలాంటివి భరించబోనని పేర్కొన్నారు. అమరీందర్ రాజీనామా చేసిన రెండ్రోజుల తర్వాత సిద్ధూ వర్గీయుడైన దళిత నేత చరణ్‌జిత్ చన్నీని సీఎంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News