మోదీ, కేసీఆర్ వల్ల దేశం, రాష్ట్రం ప్రమాదంలో పడ్డాయి: రేవంత్ రెడ్డి ఫైర్

  • ఇద్దరూ తోడు దొంగలంటూ ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్
  • అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాట్లాడిన రేవంత్
  • దేశం ఆస్తులు అమ్మేస్తున్నారని మోదీపై ఫైర్
  • రాష్ట్రంలోని భూములను బంధువులకు కట్టబెడుతున్నారని కేసీఆర్‌పై విమర్శ
తెలంగాణ రాష్ట్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ నిప్పులు చెరిగారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వీరి హయాంలో పెట్రోలు, డీజిలు ధరలు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు.

మోదీ గొప్పగా చెప్పుకునే నోట్ల రద్దు పేదల పాలిట విషప్రయోగమని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ అమ్ముకుంటున్నారని విమర్శించారు. మోదీ హయాంలో దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అంబానీ, అదానీ రెడీగా ఉన్నారన్నారు.

అదే విధంగా కేసీఆర్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను తన బంధువులకు కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. వీరి వల్ల దేశం, రాష్ట్రం పెను ప్రమాదంలో పడ్డాయని, వీటిని రక్షించుకోవాలని చెప్పారు. మోదీ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని, భారత్ బంద్‌లో తెలంగాణ ముందుండాలని రేవంత్ పిలుపునిచ్చారు.


More Telugu News