న్యూజిలాండ్ జట్టుకు భద్రత కల్పించిన పాక్ కమాండోల బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు.. లబోదిబోమంటున్న హోటల్ వర్గాలు!

  • ఇటీవల పాకిస్థాన్ వెళ్లిన న్యూజిలాండ్ జట్టు
  • వన్డే మ్యాచ్ ముందు పర్యటన రద్దు
  • అప్పటికే ఓ హోటల్లో వారం రోజులు బస చేసిన కివీస్
  • ఆటగాళ్లకు భారీ భద్రత ఏర్పాటు చేసిన పాక్
పాకిస్థాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది అనుకునేంతలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. 2009లో శ్రీలంక జట్టుపై పాక్ లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి చాన్నాళ్లపాటు విదేశీ జట్లు పాక్ లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వచ్చినా, వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆ పర్యటన రద్దయింది.

పాక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూజిలాండ్ జట్టు ఇస్లామాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసింది. కివీస్ ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం 500 మంది కమాండోలను రంగంలోకి దించింది. అయితే, న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కేవలం భద్రతా సిబ్బంది బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు అయిందట.

న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్లిపోవడంతో, పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పెండింగ్ లో ఉంచింది. హోటల్ నిర్వాహకులు మాత్రం లబోదిబోమంటున్నారు. భద్రతా సిబ్బందికి రోజుకు రెండుసార్లు బిర్యానీ పెట్టామని వారు వెల్లడించారు. ఈ బిర్యానీ బిల్లు ప్రస్తుతం పాక్ ఆర్థికశాఖ వద్ద ఉందట. కమాండోలకు తోడు సరిహద్దు భద్రతాదళం పోలీసులను కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల కోసం పిలిపించారు. వారి భోజన బిల్లులు అదనం అని హోటల్ వర్గాలు తెలిపాయి.

మరి పాక్ క్రికెట్ బోర్డు దీనిపై ఏంచేస్తుందో చూడాలి. నష్ట పరిహారం రూపంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మొత్తం కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News