త్వరలోనే చిన్నారులకు కోవాగ్జిన్.. వెల్లడించిన భారత్ బయోటెక్

  • 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి
  • మరికొన్ని వారాల్లో అందుబాటులోకి..
  • వెల్లడించిన భారత్ బయోటెక్
  • ఈ నెలలో ఇప్పటికే 3.3 కోట్ల సాధారణ వ్యాక్సిన్ల ఉత్పత్తి
కోవిడ్ నియంత్రణకోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికే అందించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది.

త్వరలో చిన్నపిల్లలకు కూడా అందించేందుకు కోవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2, 3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేశామని వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని పేర్కొంది.

మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచుతామని తెలిపారు.

ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News