ముస్లింలు, దళితుల ప్రాణాలంటే జగన్ కు అంత చిన్న చూపా?: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారుఖ్

  • అక్బర్ కుటుంబాన్ని ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది
  • న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు మాట తప్పారు
  • వైసీపీ నేతల దాష్టికాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిని ఆదుకోరా?
తన భూమిని వైసీపీ నేత తిరుపాలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని... తిరుపాలరెడ్డి చెప్పినట్టు వినకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి తమను హెచ్చరించారంటూ అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారుఖ్ షుబ్లీ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నా అరెస్టులు చేయడం లేదని దుయ్యబట్టారు. అవమానాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్బర్ కు న్యాయం చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని... ఆ హామీని తప్పి ఆ కుటుంబాన్ని మరోసారి మోసం చేసిందని ఫారుఖ్ మండిపడ్డారు. న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు మాట తప్పారని అన్నారు. న్యాయం జరగకపోవడం వల్లే అక్బర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పారు.

విశాఖలో ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదం వల్ల చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున జగన్ ఇచ్చారని... మరి వైసీపీ నేతల దాష్టీకం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారిని ఆదుకోరా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ముస్లింలు, దళితుల ప్రాణాలంటే జగన్ కు అంత చిన్న చూపా? అని ప్రశ్నించారు.


More Telugu News