ఆన్ లైన్లో సినిమా టికెట్ల అమ్మకం... ఈ పద్ధతి బాగుందంటూ సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

  • ఆన్ లైన్ టికెటింగ్ కు ప్రభుత్వ నిర్ణయం
  • సినీ రంగం నుంచి మద్దతు
  • గతంలో ఎగ్జిబిటర్ గా పనిచేసిన ముద్రగడ
  • ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ లేఖ
గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలోనే ఆన్ లైన్ విధానంలో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభించనుంది. దీనిపై మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ముద్రగడ గతంలో సినీ ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు. ఆ విధంగా సినీ రంగ సాధకబాధకాలపై అవగాహన ఉన్న ఆయన... తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

సినిమా టికెట్లను ఆన్ లైన్ విధానంలో విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ విధానమే సరైనదని తాను అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు. అయితే, సినీ రంగంలో బ్లాక్ మనీ అనేది వినిపించకుండా ఉండేందుకు తాను కొన్ని సూచనలు చేస్తున్నానని, వాటిని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని ముద్రగడ తన లేఖలో వివరించారు.

ఓ సినిమా సందర్భంగా యాక్టర్లు, టెక్నీషియన్లు, హోటల్ బస, భోజనం, కారవాన్ ఖర్చులను ప్రభుత్వం నిర్మాత నుంచి తీసుకోవాలని... ఆ డబ్బును ప్రభుత్వం సదరు యాక్టర్లు, టెక్నీషియన్లు, తదితరుల ఖాతాల్లో వేయాలని సూచించారు. ఈ విధానం ఎంతో పారదర్శకంగా ఉంటుందని, డబ్బు ఎటువైపు వెళుతోందన్న దానిపై స్పష్టత ఉంటుందని పేర్కొన్నారు. సినిమా నిర్మాణ వ్యయం తగ్గుతుందని, తద్వారా నిర్మాతకు, అందరికీ ఇది లాభదాయకంగా ఉంటుందని ముద్రగడ తెలిపారు.


More Telugu News