బెంగళూరు జట్టులో కెప్టెన్ స్థాయి ఆటగాళ్లు లేరు.. కొనుక్కోవాల్సిందే: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్

  • ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్ బై  చెబుతున్నట్టు ప్రకటించిన కోహ్లీ
  • తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ అంశంపై చర్చించిన హాగ్
  • సుదీర్ఘకాలం కొనసాగే వారికే కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని సలహా
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండో సెషన్ పూర్తయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు సారధ్య బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో అభిమానులతో పాటు చాలా మంది నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ జట్టులో తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. ప్రస్తుతం ఉన్న బెంగళూరు జట్టులో ఎవరూ కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయలేరని హాగ్ అభిప్రాయపడ్డాడు. కాబట్టి వచ్చే ఆటగాళ్ల వేలంలో మంచి ఆటగాడిని జట్టు యాజమాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ‘ఏబీ డివిలియర్స్ ఎంతకాలం ఐపీఎల్ ఆడతాడో తెలియదు. కొంతకాలం మాత్రమే అతను ఆడే పరిస్థితి ఉంటే కెప్టెన్‌గా అతను ఉండకపోవచ్చు’ అని కూడా వివరించాడు.

జట్టులో సుదీర్ఘకాలం కొనసాగే వ్యక్తికే సారధ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హాగ్ అన్నాడు. ముంబై జట్టుకు రోహిత్ శర్మ, చెన్నై జట్టుకు ధోనీ ఎలాగైతే చాలా కాలం నుంచి సారధులుగా ఉన్నారో బెంగళూరు జట్టుకు కూడా అలా ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండే వ్యక్తిని ఎంపిక చేయాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌సీబీ జట్టులోని ఎవరూ కోహ్లీ స్థానంలో సారధి పాత్రను భర్తీ చేయలేరు అని స్పష్టం చేశాడు.


More Telugu News