ఓట్ల కోసమే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ మాటలు.. బీజేపీపై మెహబూబా ముఫ్తీ ఫైర్

  • హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ అంటుంది
  • నిజానికి బీజేపీ వల్ల భారతదేశం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి
  • ప్రజలకు చెప్పడానికేం లేక ఇలాంటి మాటలు: మెహబూబా ముఫ్తీ
భారతీయ జనతా పార్టీపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్.. ఇలా అన్నింటినీ ఓట్లు దండుకోవడం కోసమే బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆమె మండిపడ్డారు. ఆదివారం ఒక సమావేశంలో మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

హిందువులు ప్రమాదంలో ఉన్నారనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా ముఫ్తీ స్పందించారు. ‘‘హిందువులు ప్రమాదంలో ఉన్నారని వారు చెప్తారు. కానీ నిజానికి బీజేపీ వల్ల భారతదేశం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి’’ అని ముఫ్తీ అన్నారు. ప్రజలకు చెప్పడానికి బీజేపీ దగ్గర ఎటువంటి మాటలూ లేవని, అందుకే ఇలాంటి మాటలు చెబుతోందని విమర్శించారు.

గడిచిన 70 ఏళ్లలో జరిగిన మంచిని బీజేపీ ఏడేళ్ల పాలనలోనే నాశనం చేసిందని ముఫ్తీ ఆరోపించారు. బీజేపీ పాలన ప్రజలకు బాధలు మాత్రమే మిగిల్చిందని విమర్శించారు. అదే సమయంలో తన విమర్శకులకు కూడా ఆమె చురకలేశారు. ‘‘స్వయంపాలన, తాలిబన్ల గురించి ప్రస్తావన తెస్తే చాలు నన్ను ఒక జాతి వ్యతిరేకిలా చూపిస్తారు. రైతుల నిరసనలు, ద్రవ్యోల్బణం వంటి ప్రజలకు ఉపయోగకరమైన విషయాలు వదిలేసి నా మాటలపై భారీ చర్చలు మొదలుపెడతారు’’ అంటూ విమర్శకులను ఆమె దుయ్యబట్టారు.


More Telugu News