విజృంభించిన ముంబై బౌలర్లు.. 6 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై

  • రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన అంబటి రాయుడు
  • ఒక్క పరుగు వద్దే ఓపెనర్ డుప్లెసిస్ అవుట్
  • చెన్నై వెన్నువిరిచిన న్యూజిల్యాండ్ పేస్ ద్వయం
ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సత్తా చాటుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించలేకపోయారు. సీనియర్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ (0) ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన మొయీన్ అలీ (0) కూడా ఒక్క పరుగూ చేయకుండానే అవుట్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఎన్నో అంచనాలతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా 6 బంతులు ఎదుర్కొని 4 పరుగులే చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోనీ కూడా 3 పరుగులకే ఆడమ్ మిల్నెకు వికెట్ సమర్పించుకున్నాడు.

న్యూజిల్యాండ్ బౌలింగ్ ద్వయం ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె తొలి పవర్‌ప్లేలో విజృంభించారు. చెన్నై కోల్పోయిన నాలుగు వికెట్లను వీళ్లిద్దరే తీశారు. అయితే 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై జట్టును యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (26) ఆదుకుంటున్నాడు. అతను చాలా సంయమనంతో ఆడుతున్నాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 47 పరుగులు చేసింది. గైక్వాడ్‌తోపాటు రవీంద్ర జడేజా (7) క్రీజులో ఉన్నాడు.


More Telugu News