ఆ కార్యక్రమంలో కరోనా సోకలేదు.. కోలుకున్న రవిశాస్త్రి ఏమంటున్నారంటే..

  • పుస్తకావిష్కరణ సభ తర్వాత కరోనా పాజిటివ్
  • రవితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకూ కరోనా
  • ఆ సభలో కరోనా సోకలేదంటున్న హెడ్ కోచ్
  • లీడ్స్ మ్యాచ్‌లోనే ఏమైనా జరిగుండాలని వివరణ
రసవత్తరంగా సాగుతున్న ఇంగ్లండ్, భారత్ టెస్టు సిరీస్ అర్ధాంతరంగా రద్దయింది. చివరి టెస్టు ఆడటానికి భారత జట్టు ముందుకు రాలేదు. శిబిరంలో కరోనా కలకలం రేగడమే దీనికి కారణం. ఇదంతా కోచ్ రవిశాస్త్రి రచించిన ‘స్టార్ గేజింగ్’ పుస్తకావిష్కరణ తర్వాతే జరిగింది. ఈ కార్యక్రమం ఆగస్టు 31న జరిగింది.

ఆ తర్వాత 3 రోజులకు రవిశాస్త్రికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతనితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా వైరస్ బారిన పడ్డారు. బృందంలోని ఇద్దరు ఫిజియోలకు కూడా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో పుస్తకావిష్కరణ సభ నుండే కరోనా సోకిందని, తొలిగా సోకిన రవిశాస్త్రి నుంచే ఇతరులకు కరోనా సోకిందని విమర్శలు వచ్చాయి.

పదిరోజుల ఐసోలేషన్‌ తర్వాత కరోనా నుంచి కోలుకున్న రవిశాస్త్రి స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పుస్తకావిష్కరణ సభలో కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 250 మంది వరకూ పాల్గొన్నారని, వారెవరికీ కరోనా సోకలేదని చెప్పారు.

కాబట్టి తను పశ్చాత్తాపపడటం లేదన్నారు. ‘‘మూడు రోజుల్లో కరోనా బయటపడదు. కాబట్టి పుస్తకావిష్కరణలో నాకు కరోనా సోకిందని అనుకోవడం లేదు. లీడ్స్‌లోనే కరోనా సోకి ఉండొచ్చు. ఇంగ్లండ్‌లో జులై 19 నుంచి కరోనా నిబంధనలు సడలించారు. ఆ సమయంలోనే ఏమైనా జరిగుండొచ్చు’’ అని రవిశాస్త్రి వివరించారు.


More Telugu News