తడిచిపోయిన బ్యాలెట్ పేపర్లు.. తాడికొండలో నిలిచిన కౌంటింగ్

  • బేజ్‌తాపురం, రావెలలో ఘటన
  • తడిచిపోయి పనికిరాకుండా పోయిన బ్యాలెట్లు
  • మరికొన్ని పేపర్లకు చెదలు
  • లెక్కింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఏపీ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుండగా, గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో మాత్రం నిలిచిపోయింది. బేజాత్‌పురం ఎంపీటీసీ, రావెల ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా, బాక్సుల్లోని బ్యాలెట్లు తడిచిపోవడంతో లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ రెండు స్థానాల్లో కౌంటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. పేపర్లు తడిచిపోవడంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మరికొన్ని బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లకు చెదలు కూడా పట్టినట్టు తెలుస్తోంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత చాలాకాలం పాటు బాక్సులు చీకటి గదుల్లో ఉండిపోవడం వల్లే వాటికి చెదలు పట్టినట్టు తెలుస్తోంది. మొత్తం బాక్సులను తెరిస్తే కానీ ఎన్ని బ్యాలెట్లు పాడైపోయాయన్న విషయం తెలియదని సిబ్బంది తెలిపారు. కాగా, బ్యాలెట్లు తడిచిపోయి పనికిరాకుండా పోవడంతో బేజాత్‌పురం, రావెల స్థానాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారా? లేక, కౌంటింగ్ కొనసాగిస్తారా? అన్న విషయం తెలియరాలేదు.


More Telugu News