టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో

  • ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ
  • మంత్రి పదవిని కోల్పోయిన బాబుల్ సుప్రియో
  • బీజేపీపై అసంతృప్తితో రాజీనామా
  • రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆవేశం
  • తాజాగా మనసు మార్చుకున్న వైనం
  • ఎంపీగా కొనసాగుతానని వెల్లడి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. బాబుల్ సుప్రియో ఇటీవలే కేంద్ర క్యాబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవిని కోల్పోయారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆయనను బలవంతంగా తప్పించారు.

దాంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, రాజకీయాల నుంచి వైదొలగుతానని అప్పట్లో ప్రకటించిన బాబుల్ సుప్రియో... తాజాగా మనసు మార్చుకున్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు బెంగాల్ అధికార పక్షం టీఎంసీ పంచన చేరారు.

ఇటీవల మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నుంచి వలస వచ్చినవారిలో బాబుల్ సుప్రియో ఐదో వ్యక్తి. ఇటీవల నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా టీఎంసీ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ, బీజేపీ నుంచి మరింతమంది నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం వారు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బహుశా వారు రేపు టీఎంసీలో చేరతారని భావిస్తున్నామని ఘోష్ పేర్కొన్నారు. వారు బీజేపీతో సంతృప్తికరంగా లేరని వివరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


More Telugu News