బోగస్​ సంస్థల నుంచి బోగస్​ రుణాలు.. సోనూసూద్​ రూ.20 కోట్ల పన్ను ఎగ్గొట్టారు: ఆదాయపన్ను శాఖ సంచలన ప్రకటన

  • మూడు రోజులుగా ఆయన ఇళ్లలో సోదాలు
  • చట్టవిరుద్ధంగా విదేశాల నుంచి నిధులు
  • 2.1 కోట్లు రాబట్టారన్న అధికారులు
  • రశీదులను రుణాలుగా మార్చి చూపారని ఆరోపణ
సినీ నటుడు సోనూసూద్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రూ.20 కోట్ల మేర పన్నులను ఎగవేశారని ఇవాళ ప్రకటించారు. మూడు రోజులుగా సోనూసూద్ ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పన్ను ఎగ్గొట్టారని, చట్టవిరుద్ధంగా ఓ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ద్వారా విదేశాల నుంచి ఆయన స్వచ్ఛంద సంస్థ రూ.2.1 కోట్ల నిధులను సమీకరించిందని అధికారులు చెప్పారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ నియంత్రణ చట్టం ప్రకారం అది నేరమని అన్నారు.

సోనూసూద్ సహా ఆయన సన్నిహితులు, భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాల సందర్భంగా పన్ను ఎగవేత ఆధారాలను సంపాదించామని తెలిపారు. లెక్కలో చూపించని ఆదాయాన్ని దారి మళ్లించేందుకు బోగస్ సంస్థల నుంచి బోగస్ రుణాలను తీసుకున్నట్టు చూపించారని ఆరోపించారు. ఇప్పటిదాకా అలాంటి 20 బోగస్ సంస్థలను గుర్తించామని అధికారులు ప్రకటించారు. డబ్బుకు బదులుగా చెక్కుల రూపంలో ఆ సంస్థలు లబ్ధి చేకూర్చాయన్నారు.

పన్నులను ఎగ్గొట్టేందుకు అకౌంట్ బుక్స్ కు సంబంధించిన ప్రొఫెషనల్ రశీదులను రుణపత్రాలుగా మార్చి చూపించారని తెలిపారు. ఆ డబ్బును ఆస్తుల కొనుగోలు, ఇతర సంస్థల్లో పెట్టుబడుల కోసం వాడారని చెప్పారు. కాగా, లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో ఇటీవలే సోనూ సూద్ ఒప్పందం చేసుకున్నారు. డీల్ కు సంబంధించి పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలతో అధికారులు సోదాలు చేశారు. కాగా, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో చాలా మందిని సోనూసూద్ ఆదుకుని వార్తల్లో నిలిచారు. ఎవరు ఏ సాయం కోరినా కాదనకుండా చేశారు.


More Telugu News