కాబూల్​ డ్రోన్​ దాడిలో చనిపోయింది ఉగ్రవాదులు కాదు.. అమాయక చిన్నారులు.. క్షమాపణలు చెప్పిన అమెరికా

  • గత నెల 29న కారుపై దాడి
  • ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో చర్య
  • వారు ఉగ్రవాదులు కాదని దర్యాప్తులో తేటతెల్లం
  • స్పందించిన అమెరికా రక్షణ మంత్రి, సైనికాధికారి
కాబూల్ లో డ్రోన్ దాడులు చేయడం అతిపెద్ద తప్పని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ కెనెత్ మెకంజీ అన్నారు. ఐఎస్ఐఎస్ (ఖొరాసన్) ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులు సహా పది మంది చనిపోయారు. ఉగ్రవాదులు వెళ్తున్నారన్న సమాచారంతో ఓ కారుపై ఆగస్టు 29న అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఆ దాడిపై అమెరికా చేసిన దర్యాప్తులో చనిపోయింది సాధారణ పౌరులని చివరికి తేలింది.

దీంతో అదో విషాదకరమైన అతిపెద్ద పొరపాటు అని మెకంజీ అన్నారు. దీనిపై అమెరికా రక్షణ మంత్రి లాయ్డ్ ఆస్టిన్ క్షమాపణలు కోరారు. దాడిలో అమాయకులు చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆస్టిన్ ప్రకటించారు. కాగా, బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంపై చర్చిస్తున్నామని, పరిహారం ఎలా, ఏ రూపంలో ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాడి చేసిన రోజు ఆ కారును దాదాపు 8 గంటల పాటు పరిశీలించామన్నారు. ఐఎస్ఐఎస్ (కే) ఉగ్రవాదులు కార్యకలాపాలను చేస్తున్న ప్రాంతంలోనే ఆ కారు చాలా సేపు ఉందని, అమెరికా నిఘా విభాగం ఇచ్చిన పక్కా సమాచారంతోనే దానిపై దాడి చేశామని చెప్పారు. అయితే, ఆ సమాచారం తప్పని తర్వాత తేలిందన్నారు. దాడిలో చనిపోయిన వారెవరికీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు లేవని చెప్పారు. కాగా, 9/11 దాడుల తర్వాత అమెరికా చేసిన ప్రతీకార యుద్ధంలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందిన 71 వేల మంది చనిపోయారు.


More Telugu News