రాజస్థాన్​ లో బాల్య వివాహాలు ఇక చట్టబద్ధం.. అసెంబ్లీలో సవరణ బిల్లు పాస్​

  • బాల్య వివాహాలను నమోదు చేసేందుకు అవకాశం
  • పెళ్లయ్యాక నెలలోపు వివరాలు ఇవ్వాలని రూల్
  • కాంగ్రెస్ సర్కార్ పై మండిపడుతున్న విపక్షాలు
బాల్య వివాహాలను అరికట్టేందుకు ఓ పక్క ఉద్యమాలు నడుస్తుంటే.. కొన్ని చోట్ల మాత్రం ఆ దురాచారం ఇంకా నడుస్తూనే ఉంది. మరి, వాటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలే.. వాటిని చట్ట బద్ధం చేస్తే పరిస్థితేంటి? రాజస్థాన్ ప్రభుత్వం అదే చేసింది. బాల్య వివాహాలకు చట్టబద్ధతను కల్పించింది. పిల్లలకు చేసే పెళ్లిళ్లను నమోదు చేసేలా రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్  (సవరణ) బిల్లు 2021ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాసైంది.

దాని ప్రకారం మైనర్లకు పెళ్లి చేస్తే.. నెలలోపు ఆ వివరాలను అధికారులకు వారి తల్లిదండ్రులు తెలియజేయాల్సి ఉంటుంది. పెళ్లిని నమోదు చేయాలి. దీనిపై బీజేపీ సహా ఆ రాష్ట్ర విపక్షాలు మండిపడుతున్నాయి. బాల్యవివాహాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లు పాసైన ఈ రోజు బ్లాక్ డే అంటూ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ లహోటీ మండిపడ్డారు. చట్టసవరణ చేయడం ద్వారా బాల్య వివాహాలను చట్టబద్ధంగా అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు.

అయితే, ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టు సవరణలో ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సవరణ చేశామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరని, అందుకే పెళ్లి నమోదను తప్పనిసరి చేశామని తెలిపారు.


More Telugu News