చవక కంప్యూటర్ల ఆవిష్కర్త క్లైవ్ సింక్లేర్ కన్నుమూత

  • 17 ఏళ్లకే చదువుకు స్వస్తి
  • 22 ఏళ్లకే సింక్లేర్ రేడియోనిక్స్ సంస్థ ప్రారంభం
  • 1973లో ప్రపంచంలోనే తొలి పాకెట్ కాలిక్యులేటర్ ఆవిష్కరణ
  • 1980లో ప్రపంచంలోనే అత్యంత చవకైన కంప్యూటర్ విడుదల
చవక ధరల కంప్యూటర్ సృష్టికర్త క్లైవ్ సింక్లేర్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె బెలిందా తెలిపారు. బ్రిటన్‌కు చెందిన ఆయన తన మేధస్సును ఉపయోగించి ప్రపంచానికి ఎన్నో గాడ్జెట్స్‌ను అందరికీ అందుబాటు ధరల్లో తీసుకొచ్చారు.

ఆయన ఆవిష్కరించిన వాటిలో పాకెట్ కాలిక్యులేటర్లు, అతి చిన్న టీవీలు, ఎలక్ట్రిక్ కార్లు, వాచీలు, చవక కంప్యూటర్లు తదితర ఉపకరణాలు ఉన్నాయి. 1980లలో ఆయన అత్యంత చవక ధరల్లో కంప్యూటర్లను ఆవిష్కరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. నేడు గేమింగ్, కోడింగ్ రంగంలో కోట్లాదిమంది ఉన్నారంటే దానికి ఆయన కృషే కారణం.

17 సంవత్సరాలు వచ్చే సరికే చదువుకు గుడ్‌బై చెప్పేసిన సింక్లేర్ కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. 22 సంవత్సరాలు వచ్చేసరికి సింక్లేర్ రేడియోనిక్స్ అనే సంస్థను ప్రారంభించారు. మెయిల్ ఆర్డర్ రేడియో కిట్లు, రేడియో ట్రాన్సిస్టర్లు తయారుచేయడం మొదలుపెట్టారు. 1973లో ప్రపంచంలోనే తొలిసారి పాకెట్ కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక 1980లో ‘జడ్ఎక్స్-80’ పేరుతో అతి తక్కువ ధరలో కంప్యూటర్‌ను ఆవిష్కరించి ఈ రంగంలో విప్లవం తీసుకొచ్చారు. అప్పట్లో దీని ధర 135 డాలర్లు (రూ. 9,945) మాత్రమే. ఆ తర్వాత తీసుకొచ్చిన జడ్ఎక్స్-81 స్పెక్ట్రం కంప్యూటర్లు బ్రిటన్‌లోనే అత్యధికంగా అమ్ముడై రికార్డు సృష్టించాయి.


More Telugu News