టీడీపీ నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయలేరు: ఆర్థికమంత్రి బుగ్గన

  • టీడీపీ నేతలపై బుగ్గన విమర్శనాస్త్రాలు
  • యనమల బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు
  • టీడీపీకి అనుకూల లెక్కలు చెబుతున్నారని ఆరోపణ
  • సుస్థిర అభివృద్ధిలో ఏపీకి మూడో ర్యాంకు వచ్చిందని వెల్లడి
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయలేరని స్పష్టం చేశారు. గతంలో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు ప్రస్తుతం విపక్షంలో ఉండి కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని బుగ్గన విమర్శించారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటును వెల్లడించకుండా, టీడీపీకి అనుకూలమైన గణాంకాలను చెబుతూ ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

2020-21లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో ఏపీకి మూడో ర్యాంకు లభించిందని బుగ్గన వెల్లడించారు. 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతం కాగా, వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. అటు, నీతి ఆయోగ్ రిపోర్టులోనూ ఏపీకి సముచిత స్థానం దక్కిందని అన్నారు. పేదరిక నిర్మూలనలో 5, అసమానతల తగ్గింపులో 6వ ర్యాంకు లభించినట్టు తెలిపారు.


More Telugu News