చంద్రబాబుపై జోగి రమేశ్ హత్యాయత్నం చేయబోయాడు.. ఆయన పెట్టిన మెసేజ్ లు డీజీపీకి కనపడలేదా?: టీడీపీ నేత పట్టాభి

  • 50, 60 మంది గూండాలను వేసుకుని జోగి రమేశ్ దాడి చేశాడు
  • జగన్, డీజీపీ ఇద్దరూ కలిసి ఆకురౌడీ జోగి రమేశ్ ను పంపించారు
  • డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన ప్రయత్నం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై జోగి రమేశ్ హత్యాయత్నం చేయబోయాడని ఆయన ఆరోపించారు. జగన్ ప్రోద్బలంతోనే జోగి రమేశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని అన్నారు. పోలీసుల సహకారంతో చంద్రబాబును హత్య చేయబోయాడని చెప్పారు.

జోగి రమేశ్ కు ఎన్ని గుండెలుంటే చంద్రబాబు ఇంటి వరకు వస్తాడని పట్టాభి అన్నారు. 50, 60 మంది గూండాలను వెనకేసుకుని జోగి రమేశ్ వచ్చాడని చెప్పారు. ఈరోజు జరిగిన దాడిలో ఏ1 జగన్, ఏ2 డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏ3 జోగి రమేశ్ అని వ్యాఖ్యానించారు. ఏ1, ఏ2 ఇద్దరూ కలిసి ఏ3 అయిన ఆకురౌడీ జోగి రమేశ్ ను దాడికి పంపించారని అన్నారు.

ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు చాలా మందికి గాయాలయ్యాయని, తన సెక్యూరిటీ కూడా గాయపడ్డారని చెప్పారు. చంద్రబాబు ఇంటి మీదకు దాడికి పోతున్నామంటూ సోషల్ మీడియాలో జోగి రమేశ్ పెట్టిన మెసేజ్ లు డీజీపీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి మీదికి దాడికి పోతున్నామని మీడియాకు కూడా మెసేజ్ లు పంపించాడని అన్నారు.

ఇంత జరిగినప్పటికీ జోగి రమేశ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటివరకు వచ్చినా ఆయనను ఎందుకు అడ్డుకోలేదని అడిగారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏమయిందని ప్రశ్నించారు. ఈరోజు జరిగిన దానికి బాధ్యత వహిస్తూ డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ మొత్తం వైసీపీకి సరెండర్ అయిందని... అయినప్పటికీ వేలాదిమంది చంద్రబాబుకు రక్షణగా నిలిచారని అన్నారు.


More Telugu News