ప్రకాశం జిల్లాలో రోడ్డుపై రన్ వేల నిర్మాణం... ప్రధానికి అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

  • అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి రహదారి రన్ వేలు
  • ఏపీలో ప్రకాశం జిల్లాలో రెండు రన్ వేలు
  • కొరిశపాడు, సింగరాయకొండ వద్ద నిర్మాణ పనులు
  • తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు అంటూ పవన్ ప్రకటన
దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగేందుకు వీలుగా జాతీయ రహదారులపై పలు చోట్ల రన్ వేలు నిర్మిస్తుండడం తెలిసిందే. ఇటీవల రాజస్థాన్ లోని బాడ్మేర్ వద్ద నిర్మించిన హైవే ఎయిర్ స్ట్రిప్ ను కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పరిశీలించారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల ఈ ఎమర్జెన్సీ రన్ వేలు నిర్మిస్తున్నారు. కొరిశపాడు-రేణంగివరం, కలికివాయ-సింగరాయకొండ వద్ద వీటి నిర్మాణం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తుతించారు. ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రోడ్లు నిర్మించడం అభినందనీయం అని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రకృతి వైపరీత్యాలు వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలు చేపడుతున్నారని కొనియాడారు.

ఇప్పటికే రాజస్థాన్ లోని బాడ్మేర్ వద్ద నేషనల్ హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంలా నిలుస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విశిష్ట పథకాన్ని ఏపీలో కూడా అమలు చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు.


More Telugu News