రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు... మృతదేహం అంబులెన్సుపై చెప్పులు విసిరిన వైనం!

  • సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
  • రైలు పట్టాలపై శవమై తేలిన నిందితుడు రాజు
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహం తరలింపు
  • కాసేపట్లో పోస్టుమార్టం
స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై పడివున్న అత్యాచార ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రైల్వే సీఐ రామ్మూర్తి నేతృత్వంలో పోలీసులు రాజు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాజు మృతదేహం ఉన్న అంబులెన్స్ పై చెప్పులు విసిరారు. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన రాజు చనిపోయినా, ప్రజల్లో అతడిపై నెలకొన్న తీవ్ర ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదనడానికి చెప్పులు విసిరిన ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి విపరీతమైన ఆవేశంతో చెప్పు తీసుకుని అంబులెన్స్ ను కొడుతుండడం వీడియోలో కనిపించింది.  పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దీంతో ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, రాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. రాజు కుటుంబ సభ్యులు వస్తే పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనిపై రాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అది రాజు మృతదేహం అని గుర్తిస్తేనే పోస్టుమార్టం ప్రక్రియ షురూ అవుతుంది.


More Telugu News