హుస్సేన్​ సాగర్​ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇదే చివరి అవకాశమన్న సీజేఐ!

  • ఓవైపు సుందరీకరణ చేస్తూనే కలుషితం చేస్తారా?
  • కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం
  • నిమజ్జనం అయిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఆదేశం
హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఈ ఒక్క ఏడాదికి మాత్రమే మినహాయింపులను ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. రబ్బర్ డ్యామ్ లను నిర్మించాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికిప్పుడు అది అయ్యే పనికాదని జీహెచ్ఎంసీ చెప్పినా హైకోర్టు తిరస్కరించింది.

ఆ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఆ పిటిషన్ ను ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించింది. హైదరాబాద్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం కొత్త సమస్య కాదని, ఎన్నో ఏళ్లుగా ఉన్నదేనని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నిమజ్జనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్ సుందరీకరణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూనే మళ్లీ ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులను ఇస్తున్నారని ఆక్షేపించారు. తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, వచ్చే ఏడాది నుంచి పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని తేల్చి చెప్పారు.

నిమజ్జనానికి ఆధునిక క్రేన్లను వినియోగించాలని, నిమజ్జనం అయిపోయిన వెంటనే ఆ వ్యర్థాలను తొలగించాలని జస్టిస్ రమణ సూచించారు. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ ను మంచినీటి కోసం వినియోగించేవారని, ఇప్పుడు ఇలా కలుషితమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.


More Telugu News