సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీ బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌

  • ఇటీవ‌ల చిన్నారిపై అఘాయిత్యం
  • రైల్వే ట్రాక్‌పై విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డ రాజు
  • రెండు చేతుల‌పై మౌనిక అని ప‌చ్చ‌బొట్టు
హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ నిందితుడు రాజు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్ పై విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డాడు. అత‌డు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి రెండు చేతుల‌పై మౌనిక పేరుతో వున్న ప‌చ్చ బొట్టులతో అది అత‌డి మృత‌దేహ‌మేన‌ని స్ప‌ష్ట‌మైంది.

రాజు కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో అత‌డు భ‌య‌ప‌డిపోయి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కాసేప‌ట్లో పోలీసులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి పూర్తి వివ‌రాలు వెల్లడిస్తారు. ప్ర‌స్తుతం సింగ‌రేణి కాల‌నీలో పోలీసులు భారీగా మోహ‌రించారు. దాదాపు 500 మంది ఉన్నారు. అక్క‌డ‌ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నలు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  

కాగా, సెప్టెంబ‌రు 9న‌ సింగ‌రేణి కాల‌నీలోని ఆరేళ్ల బాలిక అదృశ్య‌మైంది. చివ‌ర‌కు ఆమె నివ‌సించే ప‌క్కింట్లో ఉండే రాజు అనే యువ‌కుడి ఇంట్లో ఆమె మృత‌దేహం లభ్య‌మైంది. అప్ప‌టికే రాజు ఆ ఇల్లు వ‌దిలి పారిపోయాడు. బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోపించి, పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు. రాజు గురించి సమాచారం అందిస్తే రూ.10 ల‌క్ష‌లు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు.  

మ‌రోవైపు, ఈ రోజు ఉద‌య‌మే బాలిక తల్లిదండ్రులను తెలంగాణ‌ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మంత్రుల ముందు కూడా స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆ కొద్ది సేప‌టికే రాజు మృత‌దేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించామ‌ని పోలీసులు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News