కేటీఆర్ కు మానవత్వం ఉంటే వెంటనే ఇక్కడకు రావాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • చిన్నారి కుటుంబాన్ని చూసేందుకు ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్ రాలేదు
  • బతుకమ్మ అంటూ రాష్ట్రమంతా తిరిగే కవిత ఎందుకు రాలేదు?
  • నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలన్న వెంకటరెడ్డి 
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులోని సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారానికి గురైతే... బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, డమ్మీ హోంమంత్రి మహమూద్ అలీ కానీ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కానీ రాకపోవడం దారుణమని అన్నారు.

నిందితుడి ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. చిన్నారి తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుడి ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంటే ఆమె బతికి ఉండేదని అన్నారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో, పోలీసులు కూడా అంతే కారణమని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఈరోజు కోమటిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రచారాల మంత్రి కేటీఆర్ కు మానవత్వం ఉంటే వెంటనే బాధిత కుటుంబం వద్దకు రావాలని కోమటిరెడ్డి అన్నారు. బతుకమ్మ అంటూ రాష్ట్రమంతా తిరిగే కవిత కూడా ఇక్కడకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. దోషిని పట్టుకోలేకపోవడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారని... డబ్బుతో అవార్డులు కొంటున్నారని విమర్శించారు.

సినిమా యాక్టర్ ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్నారి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే.. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ చెప్పడం బాధాకరమని అన్నారు. దిశ వ్యవహారంలో చేసినట్టుగా ఇప్పుడు కూడా నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News